నాగర్‌కర్నూల్: శ్రీ పరాభవ నామ సంవత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) సందర్భంగా బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీశనేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం దేవతా నక్షత్రం కావడంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.

శని గ్రహదోష నివారణ కోసం భక్తులు స్వామివారికి తిలతైల అభిషేకాలు నిర్వహించగా, వేదమంత్రోచ్చారణల మధ్య పూజలు వైభవంగా జరిగాయి. అలాగే శ్రీ సార్థాసప్త జ్యేష్ఠమాత సమేత శ్రీశనేశ్వర స్వామివారికి ప్రత్యేక అర్చనలు, దీపారాధనలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో స్వామివారిని భక్తితో ఆరాధించిన వారికి విశేష ఫలితాలు, శని అనుగ్రహం లభిస్తాయని తెలిపారు. జన్మరాశి, గోచార ప్రభావాల వల్ల కలిగే శని దోషాల నివారణకు ప్రతి ఒక్కరూ శక్తిమేరకు స్వామివారిని పూజించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆలయంలోని గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం గల పరమశివునికి రుద్రాభిషేకాలు, నందీశ్వర స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్‌రావు, గ్రామ సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు కెంచె రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య, అడ్వకేట్ వీరశేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్‌రెడ్డి, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: తొలి ఏకాదశి సందర్భంగా శ్రీశనేశ్వర స్వామికి తిలతైల అభిషేకాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *