నాగర్‌కర్నూల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో జి. చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని, వారి ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి ద్వారా ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, రుణమాఫీ, రైతు భీమా వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో వైద్య కళాశాల ఏర్పాటు, మాతా శిశు సంరక్షణలో విశేష పురోగతి సాధించినట్లు వెల్లడించారు. విద్యా రంగంలో ఎస్సెస్సీ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని చెప్పారు.
అటవీ, పశుసంవర్ధక, ఉద్యానవన, మత్స్య, గ్రామీణాభివృద్ధి రంగాల్లో కూడా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ “జై హింద్… జై తెలంగాణ” అంటూ ప్రసంగాన్ని ముగించారు.: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *