నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి సమీపంలో ఉన్న సెవెంత్ సెంటర్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ సుగుణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆల్బెండజోల్ మాత్రలు అందించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ సుగుణ మాట్లాడుతూ, చిన్నారుల్లో నులిపురుగుల సమస్యను నియంత్రించేందుకు ప్రభుత్వం క్రమం తప్పకుండా నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు ఆల్బెండజోల్ మాత్రలను అందించడం ద్వారా పిల్లల్లో నులిపురుగుల సమస్యను నివారించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
చిన్నారులు పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న గుడ్లు, పాలు, బాలామృతం వంటి పోషకాహారాన్ని అర్హులైన చిన్నారులకు అందించాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్య పరీక్షలు ఎంతో ముఖ్యమని కార్యక్రమంలో వివరించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రతి అర్హ కుటుంబం వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అలివేల, ఆశా వర్కర్లు శ్రీదేవి, నర్మద తదితరులు పాల్గొన్నారు.: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *