ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన రైతు ప్రతినిధులు, తడిసిన మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు తీసుకుని పంట సాగు చేసిన రైతులు ఇప్పుడు నష్టాల పాలవుతున్న పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవడం అత్యవసరమని పేర్కొంటూ, ప్రభుత్వమే కనీస మద్దతు ధర (MSP)కు తడిసిన మొక్కజొన్నను కొనుగోలు చేయాలని కోరారు. అలాగే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి, మూడు రోజులలోపే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. తడిసిన లేదా నష్టపోయిన ధాన్యానికి కూడా సరైన ధర కల్పించడంతో పాటు రైతులకు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ చర్యలు చేపట్టడం ద్వారా రైతులు భారీ నష్టాల నుండి బయటపడగలరని, ఆలస్యం జరిగితే పరిస్థితి మరింత విషమిస్తుందని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు.: నాగర్ కర్నూల్‌లో అకాల వర్షాలు:తడిసిన మొక్కజొన్న కొనాలి-రైతులు






