నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో గల సీతారామచంద్రస్వామి దేవాలయంలో గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వేదమూర్తులైన బ్రాహ్మణులు నిర్వహించగా, రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడు కాలాన్ని తెలుసుకొని మెలిగితే దైవానుగ్రహం ప్రాప్తిస్తుందని అన్నారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు సవ్యంగా ఉన్నవారికి సంపద, ఆయుషు, పాప నివారణ, రోగాలు తగ్గడం, కార్యసిద్ధి వంటి ఫలితాలు లభిస్తాయని తెలిపారు. వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలాల్లో శుభకార్యాలు చేయరాదని, కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

కలియుగం ప్రారంభమై 5127 సంవత్సరాలు పూర్తయ్యాయని పేర్కొంటూ, ఈ సంవత్సరంలో గురువు రాజుగా ఉండడం వల్ల గురువుల ప్రాధాన్యత పెరుగుతుందని తెలిపారు. రైతులకు రెండు పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉందని, వివాహయోగం అధికంగా ఉండి యువతలో వివాహాలు పెరుగుతాయని అన్నారు.

మే 11 నుంచి 29 వరకు కర్తరి, 2027 జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు గురుమౌడ్యమి ఉండనున్నట్లు తెలిపారు. జూన్ 2 నుంచి 13 వరకు యమునా నది పుష్కరాలు జరుగుతాయని, మధురలో స్నానం చేయడం శ్రేయస్కరమని సూచించారు.

కార్యక్రమం అనంతరం రామాలయ కమిటీ సభ్యులు భక్తులకు షడ్రుచుల ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: శాస్త్రోక్తంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *