నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించనున్న మహా ధర్నాకు సంబంధించి జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. మంగళవారం జేఏసీ చైర్మన్ బావండ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించి పరిష్కార చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు.

అలాగే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, వారి కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్య భద్రత కోసం హెల్త్ స్కీమ్‌ను అమలు చేయాలని, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు.

ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 27న నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ఆవరణలో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. కార్యక్రమానికి ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు షర్ఫోద్దీన్, సత్యనారాయణ రెడ్డి, కృష్ణ, వెంకటప్ప, సురేష్, నజీర్, కళ్యాణ్ కృష్ణారావు, బాలరాజ్, మహేష్, రాజు గౌడ్, మహిళా నాయకులు శివరత్న, అరుణ తదితరులు పాల్గొన్నారు.: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *