నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతులను లక్ష్యంగా చేసుకుని నకిలీ డీఏపీ ఎరువుల అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా గుట్టురట్టు చేశారు. ఈ కేసులో మొత్తం 2,900 నకిలీ డీఏపీ బస్తాల అక్రమ వ్యాపారం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటివరకు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేయగా, ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పోలీసుల దాడుల్లో మహదేవునిపేటలో 110 నకిలీ డీఏపీ బస్తాలు, అమ్మాపల్లిలో 80 బస్తాలు, వెల్గొండలో 185 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. రైతుల వద్ద కూడా భారీగా నకిలీ ఎరువులు గుర్తించడంతో అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. ఈ నకిలీ ఎరువుల తయారీ కేంద్రం రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

విచారణలో జిల్లాలోని పలు మండలాలకు మధ్యవర్తుల ద్వారా నకిలీ డీఏపీ ఎరువులు సరఫరా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందిన ఎరువుల దుకాణాల్లోనే కొనుగోలు చేయాలని సూచించారు. ఎరువులు కొనుగోలు చేసే ప్రతి రైతు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, అనుమానాస్పద ఎరువులు లేదా నకిలీ ఎరువులపై సమాచారం తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనతో జిల్లాలో రైతులకు నాణ్యమైన ఎరువులు అందేలా అధికారులు మరింత అప్రమత్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.: నాగర్‌కర్నూల్‌లో నకిలీ డీఏపీ ఎరువుల ముఠా గుట్టురట్టు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *