నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాల రాష్ట్ర స్థాయి నవోదయ విద్యాలయాల ఖో-ఖో క్రీడా పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జూలై 22 నుంచి 24 వరకు జరిగే ఈ పోటీలను నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ (ఐపీఎస్) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పోటీ తత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి ముందుకు సాగడమే నిజమైన క్రీడాస్ఫూర్తి అని ఆయన అన్నారు.

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు బలమైన పునాది ఏర్పడుతుందని ఎస్పీ సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ, క్రీడలను స్నేహభావం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే వేదికగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, విద్యార్థులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు: రాష్ట్ర స్థాయి నవోదయ ఖో-ఖో పోటీలకు శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *