నాగర్‌కర్నూల్: జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్య, బోధన నాణ్యత, మౌలిక వసతులు, పరిశుభ్రత, హాజరు శాతం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ముందుగా పాఠశాల హాజరు నమోదును పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, హాజరును నిరంతరం పర్యవేక్షించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ అంకితభావంతో బోధన నిర్వహించాలని, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని పెంపొందించే వినూత్న బోధనా విధానాలను అమలు చేయాలని సూచించారు.

తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, పాఠాలపై అవగాహన, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం పెంపొందేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు.

అలాగే తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, వసతి గృహం, భోజనశాల, తరగతి గదుల పరిశుభ్రత, పాఠశాల పరిసరాలను పరిశీలించి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి సౌకర్యం నాణ్యతతో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న కలెక్టర్, మెరుగైన ఫలితాల సాధనతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు.: అప్పాయిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *