ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమెతో పాటు స్త్రీ వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ సుప్రియ, డాక్టర్ సౌమ్య, డాక్టర్ శిరీష పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, పుట్టిన వెంటనే తల్లి ఇచ్చే ముర్రుపాలు శిశువుకు తొలి టీకాలా పనిచేస్తాయని వివరించారు. ఇందులో ఉండే ఇమ్యూనోగ్లోబులిన్లు, లాక్టోఫెరిన్, విటమిన్-ఎ, విటమిన్-ఈ, జింక్ వంటి పోషకాలు శిశువులో రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెప్పారు.
శిశువుకు తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలే ఇవ్వాలని, అనంతరం అనుబంధ ఆహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువులో విరేచనాలు, న్యూమోనియా, ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గడంతో పాటు మెదడు ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు.
తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లులకు కూడా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల ప్రమాదం తగ్గడం, ప్రసవానంతర రక్తస్రావం నియంత్రణ, గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి చేరుకోవడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు వివరించారు. కార్యక్రమంలో క్లాస్మేట్ క్లబ్ సభ్యులు బాలింతలకు టిఫిన్ బాక్సులు అందజేయగా, గర్భిణులు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఆరోగ్య సిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.: నవజాత శిశువుకు తల్లిపాలే అమృతం.




