నాగర్‌కర్నూల్: జిల్లాలోని చెంచు గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఐటీడీఏ, అటవీ, గిరిజన, రెవెన్యూ, విద్య, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు.

అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని లింగాల, బల్మూర్, అమ్రాబాద్, పదర, అచ్చంపేట మండలాల్లో నివసిస్తున్న చెంచు గిరిజన కుటుంబాల పరిస్థితులు, చిన్నారుల ఆధార్ నమోదు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. ఇటీవల ఐటీడీఏ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో 760 మంది చెంచు చిన్నారులకు ఆధార్ కార్డులు లేవని గుర్తించిన నేపథ్యంలో, ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

మారుమూల అటవీ ప్రాంతాల్లోని చెంచు తండాలు, గూడెలకు అధికారులు స్వయంగా వెళ్లి ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలు నిర్వహించాలని, అవసరమైతే మొబైల్ ఆధార్ కిట్లను వినియోగించాలని ఆదేశించారు. అలాగే జనన, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేసి, ఆగస్టు 15 నాటికి నివాస ధ్రువీకరణ పత్రాలు అందించాలని చెప్పారు.

అమ్రాబాద్, పదర, లింగాల, అచ్చంపేట, బల్మూర్, కొల్లాపూర్ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి ఈ నెలాఖరులోగా చెంచు కుటుంబాలందరికీ ఆధార్ నమోదు పూర్తయ్యేలా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీటీడీఓ శ్రీ కోటాజీ, డీఆర్డీఓ చిన్న ఓబులేసు, డీఈవో రమేష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.: చెంచు గిరిజనులకు ఆధార్ నమోదు వేగవంతం చేయాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *