మరికల్: వ్యవసాయంతో పాటు పశుపోషణను అనుబంధ రంగంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. మంగళవారం తిమ్మాజీపేట మండలం మరికల్ గ్రామంలో రైతు పెర్కంపల్లి లింగం పొలాన్ని కలెక్టర్ సందర్శించి, వ్యవసాయంతో పాటు కొనసాగిస్తున్న పశుపోషణను పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతు వద్ద ఉన్న పశువుల సంఖ్య, పాలిచ్చే పశువుల వివరాలు, రోజువారీ పాల ఉత్పత్తి, పాలను ఎక్కడ విక్రయిస్తున్నారు, నెలవారీగా లభిస్తున్న ఆదాయం వంటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పశువుల పెంపకానికి అవుతున్న ఖర్చు, దాణా, పచ్చిమేత, పొడి మేత లభ్యత, పశువుల ఆరోగ్య పరిస్థితి, టీకాల వివరాలపై కూడా ఆరా తీశారు.

పశువులకు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్య సేవలు అందుతున్నాయా, గ్రామస్థాయిలో పశువైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా అనే అంశాలను కూడా కలెక్టర్ తెలుసుకున్నారు. పంటల సాగుతో పాటు పశుపోషణ కొనసాగించడం ద్వారా రైతు కుటుంబాలకు నిరంతర ఆదాయ వనరు ఏర్పడుతుందని తెలిపారు.

పశువులకు సమతుల్యమైన పోషకాహారం, నాణ్యమైన మేత, పచ్చిమేత, తాగునీరు అందించడంతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తుగా టీకాలు వేయించాలని, పశువుల ఆరోగ్యంలో మార్పులు కనిపించిన వెంటనే పశువైద్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

పశుపోషక రైతులకు ఆధునిక, శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించి, అవసరమైన సాంకేతిక సహకారం అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పశుసంపద అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కలెక్టర్ వెంట డీఆర్వో పాండు, మండల తహసీల్దార్, మరికల్ సర్పంచ్ రమాదేవి, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.

: పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *