శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన గర్భస్థ పూర్వ మరియు గర్భస్థ పిండ ప్రక్రియ (లింగ ఎంపిక నిషేధం) చట్టం 1994 (PC & PNDT Act) పై అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గర్భిణీ స్త్రీకి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, హై రిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు అందించాలని తెలిపారు.
హై రిస్క్ గర్భిణీలకు అవసరమైన ల్యాబొరేటరీ పరీక్షలు, మందులు, పోషకాహార సూచనలు అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. మాతృ మరణాలు, శిశు మరణాలను తగ్గించడంలో ముందస్తు జాగ్రత్తలు అత్యంత కీలకమని పేర్కొన్నారు.గ్రామ స్థాయిలో పనిచేసే ఏఎన్ఎంలు గర్భిణీ స్త్రీలతో నిరంతరం సంబంధం కొనసాగిస్తూ, అవసరమైన సమయంలో ఆసుపత్రులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు ప్రతినెలా ఆరోగ్య పరీక్షలకు హాజరవుతున్నారా లేదా అన్న విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
ప్రత్యేకంగా గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్లు నిర్వహించడం చట్టవ్యతిరేకమని హెచ్చరిస్తూ, జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు మరియు ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇలాంటి అక్రమ చర్యలు జరుగుతున్నట్లు సమాచారం లభిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు.
జిల్లాలో బాలికల నిష్పత్తి తగ్గుతున్న విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం 1000 మంది బాలురకు 894 మంది బాలికలు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితి కొనసాగితే సమాజానికి నష్టం కలుగుతుందని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ఆడబిడ్డల సంరక్షణకు కృషి చేయాలని, మాతృ-శిశు మరణాలు తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవికుమార్, డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ తారా సింగ్, భీమ్లా నాయక్, ప్రోగ్రామ్ అధికారులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.: గర్భిణీలు, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి





