నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొని మహర్షి భగీరథుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భగీరథ మహర్షి జీవితం, ఆశయాలు, సమాజానికి ఆయన అందించిన సందేశంపై ప్రసంగించారు.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ భగీరథ మహర్షి పట్టుదల, సేవాభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గంగానదిని భూమికి తీసుకువచ్చిన మహనీయుడిగా భగీరథుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. అందుకే గొప్ప ప్రయత్నాలను “భగీరథ ప్రయత్నం”గా పిలుస్తారని వివరించారు. లక్ష్యం పట్ల అంకితభావం, కృషి ఉంటే ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించవచ్చని భగీరథుని జీవితం యువతకు గొప్ప స్ఫూర్తినిస్తోందన్నారు.
ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా భగీరథ జయంతిని నిర్వహించడం వెనుక ఆయన ఆశయాలకు గౌరవం ఉందని కలెక్టర్ తెలిపారు. సమాజంలో నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. భగీరథుని సేవాస్ఫూర్తిని అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు
ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ భగీరథుడు భూమిపైకి గంగను తీసుకువచ్చిన మహనీయుడని, ఆయన త్యాగనిరతి, పట్టుదల స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, భగీరథుని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సగర కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సగర కుల సంఘాల ప్రతిపాదనలపై స్పందించిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, నాగర్ కర్నూల్ పట్టణంలో అవసరమైన ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సగర కుల భవనం, భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటు కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
సగర కుల సంఘ నాయకులు మాట్లాడుతూ భగీరథుని సేవలను స్మరించుకోవడం మాత్రమే కాకుండా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని కోరారు. సమాజ ఐక్యత, అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సహాయ అధికారి శ్రీరాములు, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీనివాసులు సాగర్, 18వ వార్డు కౌన్సిలర్ చంద్రకళ సాగర్, అల్లం రాముడు, సీనియర్ జర్నలిస్టు సాయిలు సాగర్, లక్ష్మణ్ సాగర్, టౌన్ అధ్యక్షుడు బాలయ్య సాగర్, బంగారయ్య సాగర్, సూరంపల్లి సుధాకర్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సగర సంఘ నాయకులు పాల్గొన్నారు.: ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *