నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసు శాఖలో వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ (IPS) నాగర్‌కర్నూల్ సబ్‌డివిజన్ పరిధిలోని కోడేర్ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ, స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు ప్రశాంతమైన, స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ప్రతి ఫిర్యాదును వేగంగా స్వీకరించి పారదర్శక విచారణ ద్వారా సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే డయల్-112 ద్వారా వచ్చే అత్యవసర కాల్స్‌పై వెంటనే స్పందించి బాధితులకు సమయానికి సహాయం అందించాలని బ్లూ కోల్ట్ సిబ్బందికి సూచించారు.
స్థానిక రౌడీషీటర్ల వివరాలను సమీక్షించిన ఎస్పీ, వారి కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ స్థాయిలో విధులు నిర్వహించే విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, సైబర్ క్రైమ్ వారియర్, సీసీటీవీ ఇంచార్జ్‌ల పనితీరును సమీక్షించి పలు సూచనలు చేశారు. స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులపై వివరాలు తెలుసుకుని, ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేకుండా సత్వర విచారణ పూర్తి చేయాలని ఎస్సైకు ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల భద్రత, సిబ్బంది క్రమశిక్షణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ, పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్, కొల్లాపూర్ సీఐ శంకర్ నాయక్‌తో పాటు కోడేర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.: కోడేర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *