పాఠశాలకు చేరుకున్న కలెక్టర్ తొలుత తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల విద్యాభ్యాసం, తరగతుల నిర్వహణ తీరును గమనించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను పరిశీలించి హాజరు వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు అనుకూలమైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని పాఠశాల ప్రత్యేక అధికారిని ఆదేశించారు.
అనంతరం వంటగదిని, పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ ఆహార పదార్థాల నిర్వహణ, వంటగది పరిశుభ్రత, భోజన తయారీ విధానంపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ విద్యార్థులకు భోజనం అందించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.
పాఠశాల ఆవరణ, వంటగది, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. చెత్తాచెదారం పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కస్తూర్బా విద్యాలయాల్లో విద్యార్థినులకు ప్రభుత్వం అందిస్తున్న విద్య, వసతి, భోజనం తదితర సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా లేదా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట బిజినపల్లి తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీవో కథలయ్య, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..



