నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ ఎన్నికపై వివాదం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన మక్కపల్లి శ్రీనివాసులు ఎన్నిక చెల్లదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జెట్టి కిషోర్ కుమార్ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు.

ఈ సందర్భంగా జెట్టి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, 2026 ఫిబ్రవరి 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మక్కపల్లి శ్రీనివాసులు నామినేషన్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల నామినేషన్ ఫారంలో వాస్తవాలను కప్పిపుచ్చి పోటీ చేసి గెలిచారని పేర్కొన్నారు. ఈ కేసు నాగర్ కర్నూల్ జిల్లా ప్రిన్సిపల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ఎన్నికల ట్రిబ్యునల్లో ఈఓపీ నెంబర్ 01/2026గా నమోదు అయిందని తెలిపారు.

అదేవిధంగా, మక్కపల్లి శ్రీనివాసులు రెండు ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకుని, 2025లో గ్రామపంచాయతీ వడ్డెమాన్లో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన విషయాన్ని దాచిపెట్టి, మళ్లీ నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో ఓటు నమోదు చేసుకుని నామినేషన్ వేయడం చట్టవ్యతిరేకమని ఆరోపించారు. ఈ చర్యలు ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమే కాక మోసపూరితమైనవని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఎన్నికను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. సెక్షన్ 233 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్రటరీ, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారి మరియు 6వ వార్డు ఎన్నికల్లో పోటీ చేసిన ఇతర అభ్యర్థులకు కోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

ఈ కేసును జిల్లా కోర్టు న్యాయవాది ఎస్. శ్యామ్ ప్రసాద్ రావు వాదిస్తున్నట్లు చెప్పారు. వాస్తవాలు బయటికి వచ్చి న్యాయం గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.: నాగర్ కర్నూల్ 6వ వార్డు కౌన్సిలర్ ఎన్నికపై వివాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *