నాగర్‌కర్నూల్ జిల్లాలో పౌర సంబంధాల శాఖ అధికారి (డిపిఆర్ఓ) వ్యవహారశైలిపై జర్నలిస్టు సంఘం నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల విషయంలో అన్యాయం జరుగుతోందని టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు పి. విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్ ఆరోపించారు.

ఐజేయు జర్నలిస్టు సంఘం పిలుపు మేరకు శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తా నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ సాగింది. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి గాంధీ పార్క్ వరకు ర్యాలీ కొనసాగింది.

తర్వాత బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌లో జిల్లాలోని జర్నలిస్టులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం అర్హత ఉన్నప్పటికీ కొందరు జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు రాకుండా డిపిఆర్ఓ కార్యాలయం నుంచి కొర్రీలు పెడుతున్నారని ఆరోపించారు. అధికారుల దృష్టికి వాస్తవ పరిస్థితులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

జర్నలిస్టుల హక్కులు, స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని నాయకులు పేర్కొన్నారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను కోరారు.

సమస్య పరిష్కారం కాకపోతే టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో మరింత తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా, తాలూకా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టు ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.: డిపిఆర్ఓ తీరు మారకపోతే ఖబర్దార్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *