భూసార పరీక్ష నేలకు శ్రీరామరక్ష” అనే సందేశంతో తాడూరు మండలంలోని ఇంద్రకల్ గ్రామంలో సేంద్రియ వ్యవసాయం మరియు మట్టి పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల, పాలెంకు చెందిన నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరం అధికారులైన ఎన్. నవత, శ్రీరమ్య ఆధ్వర్యంలో కొనసాగుతోంది.
శిబిరం రెండవ రోజు ఆదివారం ఇంద్రకల్ గ్రామంలోని రైతు వేదికలో రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లవి, ప్రశాంత్ విద్యార్థి బృందాలు సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, సేంద్రియ ఎరువుల తయారీ మరియు వాడకం గురించి రైతులకు వివరించారు. సేంద్రియ పద్ధతులను అనుసరించడం ద్వారా రైతులు ఖర్చులను తగ్గించుకుని అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు.
ఎరువులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కావ్య విద్యార్థి బృందం రైతులకు వివరించింది. అలాగే రైతులు తమ పొలాల మట్టి నమూనాలను ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మట్టి నమూనాల సేకరణ విధానం గురించి వివరించి, గ్రామంలో కొన్ని పొలాల నుండి మట్టి నమూనాలను సేకరించారు.
మట్టి పరీక్షల ద్వారా వచ్చిన నివేదిక ఆధారంగా సంబంధిత పొలంలో వాడాల్సిన ఎరువులను వ్యవసాయ అధికారులు సూచిస్తారని రైతులకు అవగాహన కల్పించారు. రైతులే దేశానికి రక్ష అని విద్యార్థులు పేర్కొన్నారు.
ఈ నెల 20వ తేదీ వరకు ఇంద్రకల్ గ్రామంలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా కళాశాల విద్యార్థులు గ్రామ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించారు.
అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చాలని విద్యార్థులు ఇంటింటా అవగాహన కల్పించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో ఆకర్ష్, నితిన్, వినాయక్, ప్రవీణ్, కార్తీక్, పవిత్ర, త్రిష, చైతన్య, అశ్విత, పల్లవి తదితర విద్యార్థి బృందాలు పాల్గొన్నారు.
ఈ శిబిరంలో గ్రామస్తులు, పాలెం వ్యవసాయ కళాశాలకు చెందిన సుమారు 167 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ ప్రజల సహకారం మరువలేనిదని నిర్వాహకులు తెలిపారు.: భూసార పరీక్ష నేలకు శ్రీరామరక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *