గద్వాల జిల్లా ధరూర్ మండలం పెద్ద చింతరేవులలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం శ్రావణ అమావాస్య సందర్భంగా శుక్రవారం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోగా, భక్తులు క్యూ పద్ధతిలో స్వామివారి దర్శనం చేసుకున్నారు.

ఆలయ ఈవో రాజేశ్వర శర్మ, ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. పలువురు భక్తులు స్వామివారికి దాసంగం ప్రసాదం సమర్పించగా, తమ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 10 వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఉడిపి పాలిమారు మఠం పీఠాధిపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, మూలరాముల సంస్థాన పూజలు నిర్వహించారు. దశవిధ హారతులు సమర్పించి, శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

భాగవత, రామాయణ ప్రవచనాలు నిర్వహించి భక్తులకు మంత్రాక్షతలు, తీర్థం పంపిణీ చేశారు. ఈనెల 25 వరకు చాతుర్మాస్య దీక్షలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గిరి రావు, అర్చకులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.: భక్తులతో క్రిక్కిరిసిన పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *