ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమం సందర్భంగా బుధవారం కల్వకుర్తి పట్టణంలోని మిషన్ భగీరథ గ్రిడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 60 ఎమ్‌ఎల్‌డీ సామర్థ్యం గల నీటి శుద్ధి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న నీటి శుద్ధి ప్రక్రియను, కేంద్రం పనితీరును సమగ్రంగా పరిశీలించారు.
నీటి శుద్ధి కేంద్రంలో నిర్వహిస్తున్న నాణ్యత పరీక్షలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. నీటి శుద్ధి విధానాలు, ఫిల్టరేషన్ వ్యవస్థ, నిల్వ ట్యాంకులు, ప్రయోగశాలలో నిర్వహిస్తున్న పరీక్షల సామర్థ్యం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు సరఫరా చేసే నీరు పూర్తిగా సురక్షితంగా ఉండేలా నిరంతరం నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్రాగునీటి శుద్ధి ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా త్రాగునీటి సరఫరాలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని పేర్కొన్నారు.
అలాగే ప్రతిరోజూ నిర్వహించే నీటి పరీక్షల నివేదికలను క్రమం తప్పకుండా నమోదు చేసి భద్రపరచాలని సూచించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
కల్వకుర్తిలోని ఈ 60 ఎమ్‌ఎల్‌డీ సామర్థ్యం గల నీటి శుద్ధి కేంద్రం ద్వారా ప్రతిరోజూ కల్వకుర్తి మరియు అచ్చంపేట నియోజకవర్గాల్లోని సుమారు 460 గ్రామాలకు, అలాగే కల్వకుర్తి మున్సిపాలిటీకి రోజుకు దాదాపు 50 మిలియన్ లీటర్ల త్రాగునీరు సరఫరా చేస్తున్నట్లు అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు.
ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్నమాల, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ అహ్మద్ హుస్సేన్, మిషన్ భగీరథ ఏఈ సంతోష్, తహసీల్దార్ తదితర అధికారులు మరియు మిషన్ భగీరథ సిబ్బంది పాల్గొన్నారు.: నాగర్‌కర్నూల్‌లో తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి




