“సేవయే లక్ష్యం – సమాజమే దేవాలయం” అనే నినాదంతో పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిర్వహించిన జాతీయ సేవా పథకం (NSS) ప్రత్యేక శిబిరం నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో విజయవంతంగా ముగిసింది. గత ఏడు రోజులుగా గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థుల కృషిని గ్రామస్తులు, కళాశాల యాజమాన్యం ప్రశంసించారు.

ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు వి. శ్రీరమ్య, ఎన్. నవత పర్యవేక్షణలో ఈ శిబిరం క్రమశిక్షణతో సాగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేట్ డీన్ డాక్టర్ కె. సుహాసిని మాట్లాడుతూ, పుస్తకాల చదువుతో పాటు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులు సంపూర్ణ వ్యవసాయ శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని తెలిపారు.

శిబిరంలో విద్యార్థులు గ్రామంలో పారిశుధ్యం, ఆరోగ్యం, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. ముగింపు రోజున ఏర్పాటు చేసిన వ్యవసాయ నమూనాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సేంద్రియ ఎరువుల తయారీ, పంట మార్పిడి, తెగుళ్ల నివారణ వంటి అంశాలను విద్యార్థులు వివరించగా రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సందడిగా జరిగాయి. శిబిరంలో ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. గ్రామ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో లెక్చరర్లు, విద్యార్థులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.: ఇంద్రకల్‌లో ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *