నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. జాతీయ కులగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి బీసీ కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ నంబర్ కేటాయించాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణనలో ఓపెన్ కాలమ్ ఉంచడం వల్ల బీసీ కులాల జనాభా లెక్కల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్నారు. గతంలో కులగణన సందర్భంగా బీసీ కులాలకు సంబంధించిన వివరాలను సరైన విధంగా నమోదు చేయకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. ఈసారి డిజిటల్ విధానంలో సర్వే నిర్వహిస్తున్నందున బీసీలకు ప్రత్యేక కోడ్ కేటాయిస్తే వివరాలను ఖచ్చితంగా నమోదు చేయవచ్చని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేక కోడ్ నంబర్లు ఉన్నప్పుడు బీసీ కులాలకు కూడా యూనిక్ కోడ్ ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీ కులాలు అనేక ఉపకులాలు, తెగలుగా విభజించబడి ఉండటంతో కులాల గుర్తింపు, జనాభా లెక్కల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

యాదవ కమ్యూనిటీలో గొల్ల, కురుమ వంటి విభాగాలతో పాటు మరిన్ని ఉపకులాలు ఉన్నాయని, అలాగే ముదిరాజ్, గౌడ్, చారి తదితర వర్గాల్లోనూ ఉపవిభాగాలు ఉన్నాయని వివరించారు. ఓపెన్ కాలమ్ స్థానంలో ప్రత్యేక బీసీ కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఇస్తే కంప్యూటర్‌లో కులాన్ని నమోదు చేసిన వెంటనే సంబంధిత వివరాలు సులభంగా గుర్తించవచ్చని తెలిపారు.

బీసీల జనాభా శాతాన్ని ఖచ్చితంగా లెక్కించేందుకు ఈ చర్యలు అవసరమని దన్నోజు అరవింద్ చారి ప్రభుత్వాన్ని కోరారు.: కులగణనలో ఓపెన్ కాలం తొలగించి ప్రత్యేక బీసీ కాలమ్ పెట్టాలి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *