జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేసి, అన్ని వసతులు సిద్ధం చేసినట్లు డీఈవో తెలిపారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ఈసారి పదో తరగతి పరీక్షలు 34 రోజుల పాటు నిర్వహించబడినట్లు ఆయన చెప్పారు. దీనికి అనుగుణంగా మూల్యాంకనాన్ని మూడు దశల్లో విభజించారు.
మొదటి విడత ఏప్రిల్ 1 నుండి 9వ తేదీ వరకు తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితశాస్త్రం సబ్జెక్టుల మూల్యాంకనం జరుగుతుంది. రెండో విడత ఏప్రిల్ 10 నుండి 17 వరకు భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పేపర్లను పరిశీలిస్తారు. చివరిగా మూడో విడతలో ఏప్రిల్ 17 నుండి 23 వరకు సాంఘిక శాస్త్రం ప్రశ్నపత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నారు.
ఈ ప్రక్రియలో 92 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 554 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 162 మంది స్పెషల్ అసిస్టెంట్లు పాల్గొంటున్నారు. అదనంగా ప్రతి సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున 16 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. క్యాంప్ ఆఫీసర్‌గా డీఈవో రమేష్ కుమార్, అదనపు క్యాంప్ ఆఫీసర్‌గా కురుమయ్య, ఎగ్జామినర్ రాజశేఖర్ రావు బాధ్యతలు నిర్వహించనున్నారు.
మూల్యాంకనం జరుగుతున్న కేంద్రంలో బెంచీలు, ఫ్యాన్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడికి రోజుకు 40 పేపర్లు మూల్యాంకనం చేయడానికి కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
మూల్యాంకనం విధులకు ఆర్డర్లు పొందిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని, గైర్హాజరు అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం కొనసాగుతుందని తెలిపారు.: నేటి నుంచి 10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం ప్రారంభం

