నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం పరిశోధన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ మహిళా రైతు సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సౌత్ తెలంగాణ జోన్ అసోసియేట్ డైరెక్టర్ డా. ఎల్. కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు రావాలని, మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన వివరించారు.
సదస్సులో మహిళా రైతులకు నూతన వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ పంటల సాగు విధానాలపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. అధిక యూరియా, రసాయనాల వాడకం వల్ల పంటలకు కలిగే నష్టాలపై డా. కాడసిద్ధప్ప వివరించారు. వేరుశనగ పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులపై డా. పద్మశ్రీ సూచనలు చేశారు. యాసంగి పంటల్లో చీడపీడల నివారణపై డా. ఎం. శంకర్ రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రైతులు మరియు శాస్త్రవేత్తల మధ్య చర్చా గోష్టి నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా పాడిపరిశ్రమ, విలువ ఆధారిత ఉత్పత్తులపై మహిళలు ముందుకు రావాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం, యాంత్రీకరణతో రైతులు అధిక రాబడి సాధించవచ్చని నిపుణులు వివరించారు.
కార్యక్రమంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ మహిళా రైతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 300 మంది రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, కెవికె, రావేప్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పాల్గొన్న వారికి సామూహిక భోజనాన్ని ఏర్పాటు చేశారు.: పాలెం పరిశోధన కేంద్రంలో ఘనంగా ప్రాంతీయ మహిళా రైతు సదస్సు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *