నాగర్ కర్నూల్, సెప్టెంబరు 20: సంఘసంస్కర్త, ఆధ్యాత్మిక విప్లవమూర్తి శ్రీ నారాయణ గురు 98వ వర్ధంతిని పురస్కరించుకుని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాళ్ల నిరంజన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో నారాయణ గురు చిత్రపటానికి బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్తో పాటు సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. భారతదేశ సామాజిక, ఆధ్యాత్మిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నారాయణ గురు కృషి చేశారని అన్నారు. “ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు మనుషులందరికీ” అనే ఆయన సందేశం సామాజిక సమానత్వానికి మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు.

1856 ఆగస్టు 20న కేరళలో జన్మించిన నారాయణ గురు చిన్ననాటి నుంచే కుల వివక్ష, అస్పృశ్యత వంటి సామాజిక సమస్యలను గమనించారని తెలిపారు. 1888లో అరువిప్పురంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి, దేవుడు అందరికీ చెందుతాడనే సందేశాన్ని చాటారని వివరించారు.

విద్య ద్వారానే అణగారిన వర్గాల అభ్యున్నతి సాధ్యమని నమ్మిన నారాయణ గురు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఆయన రచించిన ‘ఆత్మోపదేశ శతకం’, ‘దర్శన మాల’ వంటి గ్రంథాలు ఆధ్యాత్మిక, తాత్త్విక ఆలోచనలకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక ఐక్యత కోసం ఆయన చేసిన సేవలు నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభ మల్లేష్ గౌడ్, జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలు చౌదర్ల రేణుక, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు సదుర్ల తిరుపతయ్య, శ్రీపురం శ్రీనివాసులు, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.: నారాయణ గురు ఆశయాలు నేటి సమాజానికి ఆదర్శం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *