నాగర్ కర్నూలు జిల్లాలో వైద్య మరియు ఆరోగ్య శాఖకు నూతన జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో)గా డాక్టర్ కె. కృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల వైద్య మరియు ఆరోగ్యశాఖలో జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కె. కృష్ణను నాగర్ కర్నూలు జిల్లాకు బదిలీ చేశారు.
సోమవారం నాడు డాక్టర్ కె. కృష్ణ అధికారికంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిగా విధుల్లో చేరి, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌వోగా కొనసాగిన డాక్టర్ కే. రవికుమార్ నాయక్ నుండి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది నూతన అధికారికి స్వాగతం పలికారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ కె. కృష్ణ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకు నాణ్యమైన మరియు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్ర స్థాయిలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
అలాగే ఆరోగ్యశాఖలోని ప్రోగ్రామ్ అధికారులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బంది మరియు ఇతర ఉద్యోగుల సహకారంతో సమిష్టిగా ముందుకు సాగుతామని తెలిపారు. జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.: నాగర్ కర్నూలు జిల్లా డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె. కృష్ణ


