జిల్లా కేంద్రంలోని ఐడిఓసి ప్రధాన సమావేశ మందిరంలో అచ్చంపేట డివిజన్ పరిధిలోని 137 గ్రామాలకు చెందిన నూతన సర్పంచులకు నిర్వహించిన మూడవ విడత శిక్షణా తరగతులను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ స్థాయిలో ప్రధానమంత్రి, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, జిల్లా స్థాయిలో కలెక్టర్లకు ఉన్న బాధ్యతల మాదిరిగానే గ్రామ స్థాయిలో సర్పంచ్లకు కూడా కీలక బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగం గ్రామ ప్రజలే నేరుగా సర్పంచ్లను ఎన్నుకునే అవకాశం కల్పించిందని గుర్తుచేశారు.గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలకు తావు లేకుండా, ప్రతి పేద ప్రజల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని సూచించారు. మహిళా సర్పంచుల స్థానాల్లో కుటుంబ సభ్యుల జోక్యానికి అవకాశం ఇవ్వకుండా, మహిళలు స్వయంగా నాయకత్వ పటిమలను ప్రదర్శించాలని అన్నారు.
తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల పర్యవేక్షణలో చురుకుగా వ్యవహరించాలని మార్గనిర్దేశం చేశారు. గ్రామపంచాయతీలకు వచ్చే నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ పారదర్శకంగా పాలన సాగించాలని తెలిపారు.
పన్నులు మరియు స్థానిక వనరుల ద్వారా ఆదాయం పెంపొందించుకుని ప్రజోపయోగ పనులు చేపట్టాలని సూచించారు. వినూత్న ఆలోచనలతో గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు.మూడవ విడతలో అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, పదర మండలాలకు చెందిన 137 మంది సర్పంచులకు ఐదు రోజులపాటు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం, ఆర్థిక నిర్వహణ, పారదర్శక పాలన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.: గ్రామ ప్రతిష్టను కాపాడుతూ గౌరవాన్ని పెంపొందించాలి

