ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా మార్చి 12న నిర్వహించబోయే గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్ల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.
మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను విజయవంతం చేయడంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.
కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మాస్టర్ ట్రైనర్ల ద్వారా ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణను ముందస్తు ప్రణాళిక ప్రకారం రెండు సెషన్లుగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి సంబంధిత మంత్రులు, శాసనసభ్యులు మరియు ఇతర ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
ఉదయం సెషన్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై అవగాహన కల్పించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, విద్య మరియు వైద్య రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత, ఆయా పథకాల ద్వారా గ్రామాలు, మున్సిపాలిటీలలో లబ్ధిపొందిన వారి వివరాలపై అవగాహన కల్పించనున్నారు.
మధ్యాహ్నం సెషన్‌లో బాల్య వివాహాల నివారణ, రోడ్డు భద్రత, సామాజిక రుగ్మతలను అరికట్టడం, అలాగే మున్సిపల్ మరియు పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు పంపినట్లు తెలిపారు.
కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లకు గుర్తింపు కార్డులు అందజేయడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేపడతామని తెలిపారు. శిక్షణకు హాజరయ్యే ప్రజాప్రతినిధులకు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి థీమ్ అయిన పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్, ప్రతి శాఖ తమ తమ పనుల జాబితాను సిద్ధం చేసి పూర్తి వివరాలను అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు జీవి శ్యామ్ ప్రసాద్ లాల్, పి. అమరేందర్, జడ్పీ సీఈఓ దేవ సహాయం మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.: మార్చి 12న సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *