నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు మరియు స్కానింగ్ సెంటర్ల కార్యకలాపాలపై కఠిన నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు లేదా అక్రమ అబార్షన్లు నిర్వహించినట్లు తేలితే సంబంధిత ఆసుపత్రులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

శుక్రవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చెన్నయ్య, డీఎంహెచ్వో డాక్టర్ రవి నాయక్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కొల్లాపూర్ పట్టణంలో ఉన్న సాయి కృప ప్రైవేట్ ఆసుపత్రిలో ఇటీవల ఒక బాలికకు అక్రమంగా అబార్షన్ నిర్వహించారనే ఆరోపణలపై సమావేశంలో చర్చించారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆసుపత్రిని సందర్శించి సమర్పించిన నివేదికలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు కొల్లాపూర్లోని సాయి కృప ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో ఎక్కడైనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో స్కానింగ్ సెంటర్ల ద్వారా లింగ నిర్ధారణ పరీక్షలు లేదా అక్రమ అబార్షన్లు నిర్వహించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వోకు ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

జిల్లాలో ప్రస్తుతం ఉన్న 38 స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అలాగే ప్రైవేట్ ఆసుపత్రులపై తనిఖీలు మరింత ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు రిజిస్ట్రేషన్లో పొందుపరిచిన నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయా లేదా అన్న అంశంపై వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ జరపాలని తెలిపారు. స్కానింగ్ సెంటర్లపై పటిష్ట నిఘా ఉంచాలని, అవసరమైతే పోలీసు శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు.అలాగే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ మరియు రెగ్యులేషన్ చట్టం, 2010 ప్రకారం ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు మరియు నర్సింగ్ హోమ్ల నిర్వహణపై కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ లక్ష్మణ్, డిప్యూటీ డీఎంహెచ్వో రాజగోపాల్ చారి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.: కొల్లాపూర్ సాయి కృప ఆసుపత్రి సీజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *