సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్లోని తన చాంబర్లో పరీక్ష నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని అదనపు కలెక్టర్ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మార్చి 29న నిర్వహించనున్న ఈ పరీక్షల కోసం అవసరమైన ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి నిరక్షరాస్యుడు అక్షరాస్యుడిగా మారేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. అన్ని గ్రామాల్లో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధికారిక విద్యకు దూరమైన 15 సంవత్సరాలు పైబడిన వయోజనులకు చదవడం, రాయడం, లెక్కలు మరియు ప్రాథమిక జీవన నైపుణ్యాలు అందించడమే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి సమాజంలో వారికి ఆత్మవిశ్వాసం పెంపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. జిల్లాలో చదవడం, రాయడం నేర్చుకున్న నిరక్షరాస్య మహిళలు మరియు వయోజనులు మొత్తం 25,313 మంది ఈ పరీక్షకు హాజరై తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని సూచించారు.పరీక్షను జిల్లావ్యాప్తంగా సక్రమంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నపత్రాలను ఈ నెల 27వ తేదీ నాటికి జిల్లాలోని పాఠశాలలకు పంపించాలని అధికారులను ఆదేశించారు. మండల స్థాయి వాలంటీర్లు, నిర్వాహకులు మరియు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ పరీక్షను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో పీడీ డీఆర్డీఏ చిన్న ఓబులేసు, జిల్లా వయోజన విద్య అధికారి శ్రీనివాస్ రెడ్డి, డీఈఓ రమేష్ కుమార్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, సీఎంఓ వెంకటయ్యతో పాటు మండల స్థాయి వయోజన విద్య వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.: జిల్లాలో వంద శాతం అక్షరాస్యత లక్ష్యం



