నాగర్ కర్నూల్: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్, అమరేందర్, జిల్లా పరిషత్ సీఈవో దేవ సహాయం లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, వినతులను కలెక్టర్ స్వయంగా స్వీకరించి సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 44 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో వ్యవహరించాలని ఆయన అన్నారు.
అదేవిధంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అధికారులు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు. కార్యాలయాల్లో ఫైళ్లను సక్రమంగా నిర్వహిస్తూ పెండింగ్ ఫైల్స్ ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.: ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *