మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఎన్నికల నిబంధనలకు లోబడి పూర్తి పారదర్శకతతో కౌంటింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉయ్యాలవాడ నైస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.
ఉదయం 6 గంటలకల్లా సిబ్బంది హాజరు కావాలని ఆదేశించిన కలెక్టర్, ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి ప్రతి 25 ఓట్లను ఒక కట్టగా లెక్కించనున్నారు.
చెల్లిన ఓట్లు మాత్రమే అభ్యర్థి గుర్తు ఉన్న బాక్సుల్లో వేయాలని, చెల్లని ఓట్లపై నిర్ణయం రిటర్నింగ్ అధికారులదేనని వెల్లడించారు.
నాగర్‌కర్నూల్‌లో 8 టేబుళ్లు – 24 మంది అధికారులు, కల్వకుర్తిలో 8 టేబుళ్లు – 24 మంది అధికారులు, కొల్లాపూర్‌లో 7 టేబుళ్లు – 21 మంది అధికారులు విధుల్లో పాల్గొననున్నారు. ఒక్కో రౌండ్‌లో 8 వార్డుల చొప్పున మొత్తం మూడు రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి.
కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయగా, స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని, అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు: మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *