రాష్ట్ర ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకం మార్గదర్శకాల ప్రకారం సోమవారం రోజున విద్యార్థులకు కిచిడీ, గుడ్డు, మిక్స్‌డ్ వెజిటేబుల్ కర్రీ అందించాల్సి ఉంటుంది. అయితే పాఠశాలలో మాత్రం విద్యార్థులకు వైట్ రైస్, గుడ్డు, సాంబార్ మాత్రమే వడ్డిస్తున్నట్లు కలెక్టర్ గమనించారు. నిర్ణయించిన కామన్ డైట్ మెనూను ఎందుకు పాటించలేదని పాఠశాల సిబ్బందిని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు వడ్డించిన అన్నం సరిగా వండకపోవడం, సాంబార్ నాణ్యత కూడా తక్కువగా ఉండటం కలెక్టర్ దృష్టికి వచ్చింది. సాంబార్ పసుపు నీళ్ల లాగా ఉందని, అన్నం కూడా నాణ్యంగా లేదని గుర్తించి కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “రోజూ పిల్లలకు ఇలాగే భోజనం పెడుతున్నారా? అన్నం ఎలా ఉంటుందో కూడా తెలియదా?” అంటూ పాఠశాల సిబ్బందిని మందలించారు.
జిల్లాలోని అనేక పాఠశాలల్లో తాను మధ్యాహ్న భోజనం చేసి పరిశీలించినప్పటికీ ఇంత నాసిరకం భోజనం ఎక్కడా తినలేదని కలెక్టర్ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కానీ ఇలాంటి నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన మరియు పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల హెడ్‌మాస్టర్ భాస్కర్ రెడ్డి మరియు ఫుడ్ చెకింగ్ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్‌కు కలెక్టర్ ఫోన్ ద్వారా ఆదేశించారు. ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని సూచించారు. రోజువారీ కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, మధ్యాహ్న భోజన వంట ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని హెడ్‌మాస్టర్‌కు ఆదేశించారు.
అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. పరీక్షలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, ఈ సమయంలో సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. భయం లేకుండా ప్రతి పరీక్షకు హాజరై మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ విద్యా సంవత్సరం మొత్తం 128 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్రీ ఫైనల్ పరీక్షల మార్కులను ఇప్పటివరకు ఎందుకు అందించలేదని కలెక్టర్ ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ బాదాం రమేష్, ఆర్డీవో సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, వార్డు కౌన్సిలర్ నిజాముద్దీన్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్ బాలికల హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం నాసిరకం:





