మొబైల్ లోక్ అదాలత్ వ్యాన్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా బాధితులకు వారి న్యాయ హక్కుల గురించి మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించనున్నారు. అలాగే ఈ వ్యాన్లలో చట్టాలపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 34 జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలకు కేవలం నాలుగు మొబైల్ లోక్ అదాలత్ వ్యాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తాజాగా హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ మరో రెండు మొబైల్ లోక్ అదాలత్ వ్యాన్లను ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ సహా పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.
ఈ మొబైల్ వ్యాన్లలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కూడా ఉండటంతో ప్రజలు న్యాయవాదులు మరియు న్యాయ నిపుణులతో నేరుగా మాట్లాడి న్యాయ సలహాలు పొందగలుగుతారు. అలాగే చిన్న చిన్న వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ సేవలను కూడా అందించనున్నారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఈ మొబైల్ లోక్ అదాలత్ వ్యాన్లు రోటేషన్ పద్ధతిలో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా న్యాయ సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
ప్రజలు తమ న్యాయ సమస్యలకు సంబంధించి ఉచిత సలహాలు పొందేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 15100 ను సంప్రదించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత సూచించారు. ఈ మొబైల్ లోక్ అదాలత్ సేవలు ప్రారంభం కావడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయం మరింత చేరువవుతుందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.: జిల్లాకు త్వరలో ‘లోక్ అదాలత్ మొబైల్ వ్యాన్లు’
