రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలో తొలి థీమ్‌గా చేపట్టాల్సిన పరిశుభ్రత కార్యక్రమాలు ఎందుకు నిర్వహించలేదని వైద్యులను కలెక్టర్ ప్రశ్నించారు. ఒక రోజు ముందుగానే పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించినప్పటికీ వాటిని అమలు చేయకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు ఈ కార్యక్రమంపై నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని హెచ్చరించారు. 99 రోజుల కార్యక్రమం ముగిసిన తర్వాత పనిచేసిన వారికి ప్రశంసలు, పనిచేయని వారికి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో పరిశుభ్రత కీలకమని ఆయన పేర్కొన్నారు. అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి వైద్యులు, సిబ్బందితో మాట్లాడి పనితీరును తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి ఆదేశించారు. సాయంత్రం మరోసారి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తానని, అప్పటివరకు పరిశుభ్రత కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, మండల స్థాయి అధికారులు, వైద్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.: పరిశుభ్రతపై నిర్లక్ష్యం: తెల్కపల్లి పిహెచ్‌సీ వైద్యులపై ఆగ్రహం

