కలెక్టర్ ముందుగా ఔట్‌పేషెంట్ విభాగాన్ని సందర్శించి, రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స విధానం, ఔషధాల లభ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత రక్త నమూనా పరీక్షల విభాగాన్ని పరిశీలించి, రోజుకు ఎంతమందికి పరీక్షలు జరుగుతున్నాయో, ఫలితాలు ఎంత సమయంలో అందుతున్నాయో ఆరా తీశారు. పరీక్షల నిర్వహణలో ఆలస్యం జరగకుండా చూడాలని సూచించారు.
అనంతరం ప్రసూతి విభాగం, ఇంజెక్షన్ గది, ఔషధ నిల్వ గది తదితర విభాగాలను పర్యవేక్షించి, రోగుల రికార్డులు, హాజరు రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ చెప్పారు.
అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సమయానికి వైద్యం అందించడమే ప్రాథమిక లక్ష్యమని ఆయన అన్నారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరదని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.: తాడూర్ పీహెచ్‌సీని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ



