శిబిరాన్ని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వి. శేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వివిధ రకాల అంగవైకల్యాలతో ధ్రువీకరణ పత్రాలు పొందినప్పటికీ, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్న 56 మందిని గుర్తించామని తెలిపారు. వారిలో శిబిరానికి హాజరైన 44 మందిని ప్రత్యేక వైద్య నిపుణుల బృందం సమగ్రంగా పరీక్షించినట్లు చెప్పారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే. రవికుమార్ నాయక్ నేతృత్వంలో వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. అదేవిధంగా దృష్టిలోపం సమస్యతో బాధపడుతున్న 10 మంది రోగులను కూడా ఈ శిబిరంలో ప్రత్యేకంగా పరీక్షించారు. కంటి విభాగం వైద్యురాలు డాక్టర్ ప్రియాంక మరియు ఆమె బృందం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
దాదాపు 100 శాతం అంగవైకల్యం ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో అధిక మొత్తంలో పెన్షన్ మంజూరు చేయనున్నట్లు సదరం అధికారులు తెలిపారు. ఈ శిబిరం ద్వారా అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి అవసరమైన వైద్య పరీక్షలు, ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పి. శ్రీనివాసులు, క్యాంప్ అడ్మిన్ ఎ. నరసింహారెడ్డి, క్యాంప్ కోఆర్డినేటర్ పి. ప్రభాకర్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఎ. హైమావతి, ధాన్ గట్ల చంద్రశేఖర్, నర్సింగ్ సూపరింటెండెంట్ మంజుల, నర్సింగ్ అధికారులు ఎం. ఆనంద్, సిబ్బంది యాదగిరి తదితరులు పాల్గొన్నారు.: జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక సదరం శిబిరం విజయవంతం




