నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇంకా పెండింగ్‌లో ఉన్న మూడున్నర కిలోమీటర్ల పనులను తక్షణమే పూర్తి చేసి రైతులకు తాగునీరు, సాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కూడా ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పోరాటాలు నిర్వహించానని, అవసరమైతే ఇప్పుడు కూడా వయస్సును లెక్కచేయకుండా ప్రాజెక్టులను సందర్శించి రైతుల కోసం పోరాటం చేస్తానని హెచ్చరించారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథక పనులను పూర్తి చేసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ముందుకు వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. జిల్లాలో విద్యుత్ సమస్యలు నెలకొని ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
పథకంలో ఐదు మోటర్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, రైతులు పండించిన మొక్కజొన్న పంటను ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఈ సమస్యలపై వివరాలు ఇచ్చినట్లు తెలిపారు.
తాను రాజకీయాల కోసం విమర్శించడం లేదని, రైతుల సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో నాయకులు అర్థం రవి, పాండు, లక్ష్మయ్య, అర్జునయ్య, బాల గౌడ్, వెంకటేష్, సత్యం, అహ్మద్, భీమయ్య, భీముడు, విష్ణు చారి తదితరులు పాల్గొన్నారు.: రైతుల కష్టాలు నేతలకు పట్టవా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *