నాగర్కర్నూల్ జిల్లాలో ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ తదితర శాఖల అధికారులతో పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు.

జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 7,557 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 7,616 మంది కలిపి మొత్తం 15,173 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకు అనుగుణంగా 34 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రశ్నాపత్రాలను పోలీసు ఎస్కార్ట్ మధ్య భద్రతతో తరలించాలని, పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేయాలని సూచించారు. కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, సెల్ ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు.అలాగే ప్రతి కేంద్రంలో తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం, ప్రథమ చికిత్స సదుపాయం కల్పించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *