నాగర్ కర్నూల్ జిల్లాలో పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం జీనుకుంట గ్రామంలో జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ విడుత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశువుల ఆరోగ్యం కాపాడటం పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. పాడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో నేటి నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో సుమారు 2 లక్షల 50 వేల పశువులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 65 ప్రత్యేక టీములు గ్రామాల వారీగా పశువులకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని కోరారు. పశువులకు సమయానికి టీకాలు వేయించడం ద్వారా వ్యాధులు వ్యాపించకుండా నివారించవచ్చని అన్నారు.

అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజ్ శుభ్రపరిచే పనులను పరిశీలించారు. అలాగే అంగన్వాడీ కేంద్రం మరియు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరిశుభ్రత కార్యక్రమాలపై అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో ప్రతి ఒక్కరు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *