నాగర్ కర్నూల్ జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ మరియు పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా ఎస్పీ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడపాలని, పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ దుకాణాలు మూసివేసి, నిషేధాజ్ఞలు అమలు చేయాలని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహణ ఉంటుందని తెలిపారు. మొదటి సంవత్సరం 7,557 మంది, రెండో సంవత్సరం 7,616 మంది కలిపి మొత్తం 15,173 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
అలాగే పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయని వెల్లడించారు. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు పరీక్షలు నిర్వహించనుండగా, జిల్లావ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 10,683 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, ఇందులో బాలురు 5,264 మంది, బాలికలు 5,394 మంది ఉన్నారు.
పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రశ్నపత్రాల రవాణా, భద్రపరచడంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని, విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా అనుకూల వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.: ఇంటర్, టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *