సోమవారం ఈ కార్యక్రమాల తొలి రోజున నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి వైద్య ఆరోగ్యశాఖ, ఫుడ్ సేఫ్టీ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడా ప్రాంగణం నుండి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించాలంటే సరైన ఆహారపు అలవాట్లు అత్యంత అవసరమని పేర్కొన్నారు. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి పెరగడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందని చెప్పారు.
ప్రజలు తమ రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, పాలు, ధాన్యాలు, ప్రోటీన్ పదార్థాలను తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు. అధిక నూనె, ఉప్పు, చక్కెర కలిగిన ఆహారాలను తగ్గించాలని, ముఖ్యంగా యువత ఫాస్ట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇంటివద్ద తయారైన ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు.
అలాగే ప్రతిరోజూ తగినంత నీరు తాగడం, సమయానికి భోజనం చేయడం, శారీరక వ్యాయామం చేయడం వంటి మంచి అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెప్పారు. ఆహారం ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ వివరించారు.
పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు ఆరోగ్యకర ఆహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
హెల్త్ వీక్‌లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తమంగా పనిచేసిన వారిని సత్కరించనున్నారు. ఏప్రిల్ 8న రక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా సురక్షిత ప్రసవాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఏప్రిల్ 9న ఎయిడ్స్ నియంత్రణపై ‘రెడ్ రన్’ నిర్వహించి అవగాహన కల్పించనున్నారు. ట్రాన్స్‌జెండర్ వర్గాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల్లో చైతన్యం కల్పించనున్నారు.
ఏప్రిల్ 10న హోమియోపతి, ఆయుష్ దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి కుమార్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిణి శ్రీలత, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్‌లో హెల్త్ వీక్ ప్రారంభం









