కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ బాదాం రమేష్‌తో కలిసి ఆయన పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా చీపురు పట్టి పాఠశాల ఆవరణలోని చెత్తను తొలగిస్తూ శుభ్రత పనులు చేశారు. అధికారులే కాకుండా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు.
పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటే విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందుతాయని అన్నారు. విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని చెప్పారు. పాఠశాల ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
విద్యార్థుల్లో పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణపై కూడా అవగాహన పెంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాల పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా మున్సిపల్ సిబ్బంది తరచుగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండటం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో అవసరమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిధుల ద్వారా ఈ కిచెన్ షెడ్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలని డిఆర్డిఓకు సూచించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం సక్రమంగా నిర్వహించేందుకు కిచెన్ షెడ్ త్వరగా పూర్తి కావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఆర్డీవో సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, వార్డు కౌన్సిలర్ నిజాముద్దీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.: పాఠశాల పరిశుభ్రత కార్యక్రమంలో చీపురు పట్టిన కలెక్టర్ సంతోష్




