నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమానికి కల్వకుర్తి మండలం తర్మికల్ గ్రామంలో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్ వరలక్ష్మి స్వంత నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కలెక్టర్ ప్రారంభించారు. గ్రామ భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు భద్రత సాధ్యమని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని హెచ్చరించారు. పాదచారులు కూడా జాగ్రత్తగా రోడ్లు దాటాలని, జీబ్రా క్రాసింగ్లను వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే గోడపత్రికను ఆవిష్కరించారు. అలాగే గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడే సిపిఆర్ (CPR) విధానంపై శిక్షణ ఇచ్చారు.
అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో చిన్న బాలు, తాహసిల్దార్, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.: తర్మికల్ గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమానికి శ్రీకారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *