దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పని విధానం అమలు చేయాలంటూ జాతీయ సమ్మెకు పిలుపునిచ్చారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహించగా, నాగర్‌కర్నూల్ జిల్లాలో కూడా బ్యాంకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నాగర్‌కర్నూల్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు నిరసన చేపట్టారు. బ్యాంకు ఉద్యోగులకు కూడా ఇతర ఆర్థిక సంస్థల మాదిరిగా వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానం ద్వారా పని – వ్యక్తిగత జీవన సమతుల్యత సాధ్యమవుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు.ఉద్యోగుల సంక్షేమంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ డిమాండ్ కీలకమని UFBU నేతలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.ఈ సమ్మెలో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని SBI శాఖల ఉద్యోగులు, అధికారులు పూర్తిస్థాయిలో పాల్గొనడంతో సాధారణ బ్యాంకింగ్ లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ సమ్మెకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గ్రామీణ బ్యాంకు (TGB) ఉద్యోగులు కూడా మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో UFBU ప్రతినిధులు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, రాజేశ్ చారి, లక్ష్మణ్ తదితరులు పాల్గొని బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లపై ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *