నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం మరియు ఆయుష్ దినోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్లో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఆరోగ్య థీమ్-డే 5 సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఎ డాక్టర్ రవి కుమార్ సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడానికి హోమియోపతి, యోగా, ఆయుర్వేద వంటి ఆయుష్ వైద్య విధానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహిస్తూ ప్రజలకు మరింత చేరువ చేస్తోందని అన్నారు.

హోమియోపతి వైద్యం “సిమిలియా సిమిలిబస్ కురెంటూర్” అనే సిద్ధాంతంపై ఆధారపడి శరీరంలోని సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించి వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందని కలెక్టర్ వివరించారు. ఈ వైద్య విధానం రోగి శారీరక, మానసిక స్థితులను పరిగణనలోకి తీసుకుని చికిత్స అందించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు, అలర్జీలు, చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం అందిస్తుందని తెలిపారు.

తక్కువ ఖర్చుతో, తక్కువ దుష్ప్రభావాలతో అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉండే హోమియోపతి సేవలను గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే వ్యాధి నివారణ, ఆరోగ్యకర జీవనశైలి, మాతృ-శిశు సంరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించారు.

వెల్నెస్ సెంటర్లు, ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ నాయక్, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ఉషారాణి, వివిధ విభాగాల వైద్యులు, రోగులు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్‌లో ప్రపంచ హోమియోపతి దినోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *