అచ్చంపేట: 2027లో నిర్వహించనున్న జనగణనలో గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు కాలం కేటాయించాలని తెలంగాణ గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అచ్చంపేట ఆర్డీవో కార్యాలయం ముందు గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ దేశంలో సుమారు 750 గిరిజన తెగలకు రాజ్యాంగం షెడ్యూల్ ట్రైబ్ హోదా కల్పించిందని గుర్తు చేశారు. అయితే జనగణనలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వంటి మతాల కింద మాత్రమే గుర్తింపు ఇస్తున్నారని విమర్శించారు. గిరిజనులను ప్రత్యేకంగా షెడ్యూల్ ట్రైబ్ లేదా ప్రకృతి ఆరాధకులుగా గుర్తించే విధంగా ప్రత్యేక కాలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
గిరిజనులకు ప్రత్యేకమైన సంస్కృతి, సాంప్రదాయాలు, వేషభాషలు, ఆచారాలు ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు. తండాలు, గూడెంలలో నివసించే గిరిజనుల ప్రత్యేకతను గుర్తిస్తూ జనగణనలో వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
గిరిజనుల మనుగడకు ఎలాంటి నష్టం కలగకుండా 2027 జనగణనలో ప్రత్యేక గుర్తింపు కల్పించాలని కోరుతూ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎల్. దేశ నాయక్, కే. రవి నాయక్, ఎస్. అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.: 2027 జనగణనలో గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు కాలం కేటాయించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *