వెన్నచర్ల పీహెచ్‌సీలో వైద్యుల విధుల నిర్లక్ష్యంపై డాక్టర్ ప్రశాంత్‌పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం, ప్రజల ప్రాణాలతో చెలగాటం సహించం
రాజీనామా చేసి వెళ్లండి, వెన్నచర్ల పీహెచ్‌సీలో కలెక్టర్ హెచ్చరిక, వైద్య సేవలు చేయలేకపోతే ఉద్యోగం వదిలేయండి,
నిర్లక్ష్య వైద్యులపై కఠిన చర్యలు, జిల్లా కలెక్టర్ సంతోష్,
నాగర్‌ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పెద్దకొత్తపల్లి మండలంలోని వెన్నచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వైద్య సేవల కోసం వచ్చే ప్రతి రోగికి పూర్తిస్థాయి, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
ఓపీ నమోదు విభాగం, ల్యాబొరేటరీ, ఇన్‌పేషెంట్ వార్డు, ప్రసూతి విభాగం, మందుల పంపిణీ కేంద్రం తదితర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. రోగులకు అవసరమైన అన్ని పరీక్షలు సక్రమంగా జరుగుతున్నాయా, మందులు సమయానికి అందుతున్నాయా అనే అంశాలపై ఆరా తీశారు.
గర్భిణీ స్త్రీలకు అవసరమైన వైద్య పరీక్షలు, ప్రసూతి సేవలు, చిన్నారులకు టీకాలు, సాధారణ రోగాలకు చికిత్స, అత్యవసర సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
అలాగే ఆసుపత్రిలో పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు విషయంలో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు.
గ్రామీణ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంచుకునేలా మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యులు వారంలో నాలుగు రోజులు రావట్లేదని వైద్య పరీక్షలు నిర్వహిస్తలేరని, రోగులకు సరైన వైద్య సేవలు అందిస్తలేరని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా, కలెక్టర్ డాక్టర్ ప్రశాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగం చేయడం ఇష్టం లేకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలని, వైద్య సేవలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్ ప్రశాంత్ ను విధులనుంచి తొలగించాలని ఫోన్ ద్వారా డిఎంహెచ్వోను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంట అధికారులు తదితరులు ఉన్నారు.: పీహెచ్సీలో వైద్యుల నిర్లక్ష్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *