నాగర్‌కర్నూల్ పట్టణంలో రేపు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మంది కౌన్సిలర్లు ఘన విజయం సాధించగా, విపక్ష భారత రాష్ట్ర సమితి నుంచి 6 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వీరంతా రేపు ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ కౌన్సిలర్లను రాజధాని సమీపంలోని ఓ ఫామ్ హౌస్‌కు తరలించినట్లు తెలిసింది. రేపు ఉదయం అందరూ కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, అధికార పార్టీలో చైర్మన్ పదవి కోసం పలువురు కౌన్సిలర్లు పోటీ పడుతుండగా, వైస్ చైర్మన్ పదవికీ గట్టి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
తమ ఆశయాలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లిన ఆశావాహులకు—పార్టీ అధిష్టానం నిర్ణయమే తుది అని స్పష్టం చేసినట్లు సమాచారం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు “షీల్డ్ కవర్”లో ఉంటాయని, అందువల్ల ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా సహించేది లేదని పార్టీ పెద్దలు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చైర్మన్ పదవి ఒక కౌన్సిలర్‌కు, వైస్ చైర్మన్ పదవి మరో కౌన్సిలర్‌కు ఖరారైనట్లు పట్టణ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా షీల్డ్ కవర్ తెరచే వరకు స్పష్టత రానందున ఉత్కంఠ కొనసాగుతోంది. రేపటి ప్రమాణస్వీకారం అనంతరం చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నికలపై పూర్తి క్లారిటీ రానుంది.: రేపే నూతన మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *